Games

 

19 Nov 2017

గీతామకరందము-01-07,08,09

1 comments
01-07,08,09-గీతా మకరందము.
        అర్జునవిషాదయోగము
    
      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అస్మాకం తు విశిష్టా  యే 
తాన్నిబోధ ద్విజోత్తమ
నాయకా మమ సైన్యస్య 
సంజ్ఞార్థం  తాన్ బ్రవీమి తే|| 

తా:- ఓ బ్రాహ్మణోత్తమా! ఇక మనసైన్యములో ప్రముఖులు, సేనానాయకులు ఎవరుకలరో వారలను జ్ఞాపకముకొఱకు మీకు చెప్పుచున్నాను. (వినుడు).

వ్యాఖ్య:- ప్రతిపక్షవీరులను మాత్రము తెలిపినచో ద్రోణున కొకవేళ అధైర్యము కలుగునేమోయని తలంచి ధైర్యోత్పాదనము కొఱకు స్వకీయ శూరవీరులను గూడ దుర్యోధనుడు తెలుప నారంభించుచున్నాడు. 
08
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ 
కృపశ్చ సమితింజయః | 
అశ్వత్థామా వికర్ణశ్చ 
సౌమదత్తి స్తథైవ  చ * || 
09
అన్యే చ బహవశ్శూరా 
మదర్థే త్యక్తజీవితాః | 
నానాశస్త్ర ప్రహరణాః 
సర్వే యుద్ధవిశారదాః || 

తా:- మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇంకను నాకొఱకు తమతమ జీవితములను ధారబోయునట్టి అనేక ఇతర శూరులు, అందఱును యుద్ధసమర్థులై వివిధ శస్త్రాస్త్రసంపన్నులై ఇచట నున్నారు.

వ్యాఖ్య:- దుర్యోధనుడు వీరులను పేర్కొనునపుడు తన పక్షమునకు భీష్ముడు సేనాపతి
యైయుండ, ఆతని పేరు ముందు చెప్పక ద్రోణునిపేరు ఏల చెప్పవలసివచ్చెను? ఎదుటనున్న ద్రోణు డేమి భావించుకొనునోయని సందేహించికాని, గురువును ప్రప్రథమమున ఎన్నుకొనుట భావ్యమని తలంచికాని, ద్రోణాచార్యుని ఉత్తేజపఱచు నుద్దేశ్యముతోగాని అట్లు చేసియుండవచ్చును.
రెండు సేనలయందలి శూరవీరులను ద్రోణాచార్యుడెఱిగియున్నను, అతనితో జెప్పునెపమున దుర్యోధనుడు వారలను తిరిగి జ్ఞాపకము చేసికొని బలాబలములను లెక్కించుచున్నాడు. 

'త్యక్తజీవితాః' = (ప్రాణములను విడిచిపెట్టినవారు) — అను పదము దుర్యోధనుని ముఖతః వెలువడుటబట్టిచూడ తన వారందఱున్ను నశించియే పోవుదురని ముందుగనే అతని అంతరాత్మ భావించియుండవచ్చునని తోచుచున్నది. ఆ ప్రకారముగ పలుకుట దుర్యోధనునకు దుర్నిమిత్తసూచకమని కొందఱి మతము.
------------------------------------------
*సౌమదత్తిర్జయద్రథః - (పాఠాన్తరము)

1 comments:

Unknown said...

Very informative

Post a Comment