Games

 

16 Nov 2017

గీతామకరందము 01-02

0 comments
01-02-గీతా మకరందము.
        అర్జునవిషాదయోగము
    
      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అ||  ధృతరాష్ట్రుని ప్రశ్నకు సమాధానముగా సంజయు డిట్లు  వచించుచున్నాడు -

సంజయ ఉవాచ :-
దృష్ట్వాతు పాణ్డవానీకం 
వ్యూఢం దుర్యోధనస్తదా |  
ఆచార్యముపసంగమ్య 
రాజా వచనమబ్రవీత్ || 

తా:- ధృతరాష్ట్రునితో సంజయు డిట్లు వచించెను - అపుడు రాజైన దుర్యోధనుడు వ్యూహాకారముగ రచింపబడి యున్న పాండవసేనను జూచి, తదుపరి గురువగు ద్రోణాచార్యుని సమీపించి యిట్లు  పలికెను.
వ్యాఖ్య:- పాండవసేనాపతియగు ధృష్టద్యుమ్నుడు యుద్ధశాస్త్రానుసారముగ తన సైన్యమును వజ్రమను పేరుగల వ్యూహముగ నమర్చియుంచెను. పాండవసేనయొక్క అద్భుత వ్యూహరచన దుర్యోధనున కాశ్చర్యముగొలుప, అంతకంటెను పటుతరముగ తన సైన్యమును నిర్మింపజేయ నుద్దేశ్యముతో కాబోలు వెనువెంటనే ఆ వార్తను గురువగు ద్రోణాచార్యున కెఱింగించెను.
దుర్యోధనుడు రాజు. ప్రభుత్వమున సర్వోన్నతస్థానము నలంకరించినవాడు. అట్టిచో తనకంటె క్రింది స్థానముననున్న ఒకొనొక సేనానాయకుని యొద్దకు తానే స్వయముగ బోవలసిన పనియేమి యను శంక నిచట నుదయించును. ఇందులకు కారణము లివియై యుండవచ్చును - 
(1) పాండవుల సైన్యమును, అందును ముఖ్యముగ భీమాదులను జూచి భయపడి దుర్యోధనుడు అధైర్యమును బొంది యుండవచ్చును. (ప్రారంభములోనే రాజు ధైర్యమును గోల్పోవుట అశుభసూచకము). 
(2)ద్రోణాచార్యుడు సేనానాయకులలో నొకడు కావున ఆతనిని ఆ స్థానమునుండి కదలించినచో సైన్యమంతయు చెదరిపోవు నవకాశము కలదు. 
(3)ద్రోణాచార్యుడు వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు. పైగా గురుస్థానముననున్నవాడు. అట్టివానియెడల విధేయత చూపుట ధర్మము. 
(4) ఏదియో విధముగ ద్రోణాచార్యుని మంచిచేసికొని ఆతనిని తన స్వార్థసంపాదనమునకు వినియోగించదలంచి యుండవచ్చును - ఈ యన్ని కారణముల బట్టి దుర్యోధనుడు ఆచార్యుని తన యొద్దకు పిలిపించక తానే ఆచార్యునికడకేగి విన్నవించుకొనెను.

0 comments:

Post a Comment