Games

 

21 Jan 2017

0 comments
09-14-గీతా మకరందము
రాజవిద్యారాజగుహ్యయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అ|| దైవీప్రకృతికలవారి లక్షణములు నింకను వివరించుచున్నాడు -

సతతం కీర్తయన్తో మాం
యతన్తశ్చ దృఢవ్రతాః |
సమస్యన్తశ్చ మాం భక్త్యా
నిత్యయుక్తా ఉపాసతే ||

తా:- వారు (పైనదెల్పిన దైవీప్రకృతిగలవారు) ఎల్లప్పుడు {భగవంతుడు నన్నుగూర్చి కీర్తించుచు, దృఢవ్రతనిష్ఠులై ప్రయత్నించుచు, భక్తితో నమస్కరించుచు, సదా నాయందు చిత్తముంచినవారలై నన్ను సేవించుచున్నారు.

వ్యాఖ్య:- మహాత్ములగువారు పరమాత్మను అనన్యమనస్సుతో సేవింతురని పై శ్లోకమందు చెప్పబడినది. ఎట్లు సేవింతురో. ఆ పద్ధతి యిచట తెలుపబడినది. సర్వకాల సర్వావస్థలయందును వారు భగవంతుని స్మరించుచుందురు, కీర్తించుచుందురు. ‘సతతమ్’ అని చెప్పినందువలన ఏదియో యొక సమయమున కీర్తించుట కాదనియు, నిరంతరము కీర్తించుచుందురనియు తెలియుచున్నది. సాకారభక్తికలవారైనచో భగవంతుని నామస్మరణాదులు గావించుదురు. నిరాకారభక్తిగలవారైనచో హృదయమున ఆ పరమాత్మను గూర్చిన మనననిదిధ్యాసనములను గావించుదురు.
    వారు భగవత్ప్రాప్తికై సదా యత్నశీలురై యుందురు. ఇంద్రియనిగ్రహాదులను (శమదమాదులను) అభ్యసించుచుందురు. వారు  సోమరులైయుండరు. ప్రయత్నశీలురకు మాత్రమే దైవపదము లభ్యమగునుగాని తదితరులకుగాదని ఈ ‘యతన్తశ్చ’ అను పదమువలన సుస్పష్టమగుచున్నది. ప్రయత్నములేనిచో ప్రాపంచికవస్తువే సిద్ధింపకయుండ ఇక దైవవస్తువును గూర్చి వేఱుగ చెప్పవలెనా?వారు చేయునది సామాన్యప్రయత్నము కాదు. ‘దృఢవ్రతముల’ నవలంబించి గొప్ప పట్టుదలతో పరమార్థసాధనములను గావించుదురు.
      ‘తే ద్వన్ద్వమోహనిర్ముక్తా భజన్తే మాం దృఢవ్రతాః’ (7-28) అని వారి యీ దృఢవ్రతశీలత్వమునుగూర్చి యిదివఱకే గీతాచార్యులు చెప్పియున్నారు. ఇపుడు మరల దానినే ప్రస్తావించుటబట్టి అద్దాని గొప్పతనము, అత్యావశ్యకత నిరూపితమగుచున్నది. బహుజన్మార్జిత పాపవాసనలతో, మలినసంస్కారములతోను గూడి మదించియున్న మనస్సును లొంగదీయవలెననిన సాధకుడు కొన్ని వ్రతములను తప్పక శీలించవలసియుండును. (ఉపవాసవ్రతము, మౌనవ్రతము, జపవ్రతము, ధ్యానవ్రతము, బ్రహ్మచర్యవ్రతము మున్నగునవి). అయితే దృఢవ్రతములుగ నుండవలెనేకాని దుర్బలవ్రతములుగ నుండరాదు. అనగా వానిని మధ్యమధ్య భంగమొనర్పరాదు. వ్రతములందు, నియమములందు, పరమార్థనిష్ఠయందు ఇట్టి దృఢత్వము లేనందువలననే అనేకులు ఈ మార్గమున ప్రవేశించియు బలవత్తరమగు మాయచే పరాజితులై వెనుకకు మఱలిపోవుచున్నారు. మాయ భయంకరమైన శత్రువు. అది సామాన్యాయుధములకు లొంగదు. కావున దృఢవ్రతములు అను దివ్యాస్త్రములచే దానిని ఓడించవలెను.
   ‘నిత్యయుక్తాః’ - అని చెప్పుటచే వారు నిరంతరము ఏకాగ్రతతో భగవంతుని యందు చిత్తమును నెలకొల్పుచుందురని స్పష్టమగుచున్నది. అయితే ‘భక్త్యా’అను పదమును గూడ చేర్చినందువలన వారు చేయు వందనముగాని, ధ్యానముగాని నిర్మలభక్తితో గూడియుండునదియే యగునని తెలియుచున్నది. భగవంతుని ధ్యానించువారు పెక్కురుండవచ్చునుగాని  భక్తితో ధ్యానించువారు చాల అరుదు.
      ‘స తు దీర్ఘరాలనైరన్తర్య సత్కారసేవితో దృఢభూమిః’ అని పతంజలి మహర్షియు ప్రీతితో గూడిన ధ్యానాది నిరంతరయత్నములకే ఎక్కువ ప్రాధాన్యమొసంగియుండిరి. ఈ ప్రకారముగ నిరంతరదైవస్మరణము, దృఢవ్రతత్వము, భక్తితో గూడిన నిరంతర ధ్యానము భగవత్సాక్షాత్కారమునకు మార్గములని ఈ శ్లోకముద్వారా వెల్లడియగుచున్నది. కావున ముముక్షువు లట్టి యాచరణను శీలించి దైవీప్రకృతికలవారై యత్నించినచో బ్రహ్మసాయుజ్యమును శీఘ్రముగ బొందగలరు.
 
ప్ర:- మహాత్ములగువారు భగవంతుని ఏ ప్రకారము సేవింతురు?
ఉ:- (1) ఎల్లపుడు కీర్తించుచుందురు (2) దృఢవ్రతము లవలంబించి దైవప్రాప్తికై యత్నించుచుందురు.  (3) భగవానుని భక్తితో నమస్కరించుదురు (4) చిత్తమును అన్యత్రపోనీయక పరమాత్మయందే సదా నెలకొనియుండులాగున చూచుదురు.
ప్ర:- దీనిని బట్టి భగవత్ప్రాప్తికి ఉపాయము లేవియని స్పష్టమగుచున్నది?
ఉ:- (1) నిరంతర స్మరణము (2) దృఢవ్రతసంయుక్తమగు యత్నము (3) భక్తితో గూడిన వందనము, ధ్యానము (4) ఏకాగ్రతతో గూడిన నిరంతర దైవచింతనము (నిత్యయుక్తత్వము) అనునవి భగవత్ప్రాప్తికి ఉపాయములని తేలుచున్నది.
ప్ర:- భగవంతుని ఎపుడెపుడు స్మరించవలెను, కీర్తించవలెను ?
ఉ:- నిరంతరము.
ప్ర:- ఎట్టి వ్రతములు గలిగి యత్నించవలెను?
ఉ:- దృఢవ్రతములుగలిగి.
ప్ర:- భగవచ్చింతన యెట్లు చేయవలెను?
ఉ:- భక్తితో గూడి.

0 comments:

Post a comment