Games

 

14 Nov 2017

గీతామకరందము 18-78

0 comments
గీతామకరందము18-78
18-78-గీతా మకరందము.
        మోక్షసన్న్యాసయోగము
   
      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అll శ్రీకృష్ణారునులుండుచోట విజయము, ఐశ్వర్యము మున్నగు శుభలక్షణములు వెలయుచుండునని సంజయుడు పలుకుచున్నాడు –

యత్ర యోగేశ్వరః కృష్ణో
యత్ర పార్థో ధనుర్ధరః |
తత్ర శ్రీర్విజయో భూతిః
ధృవా నీతిర్మతిర్మమ ||

తా:- ఎచట యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడున్ను , ఎచట ధనుర్ధారియగు అర్జునుడున్ను ఉందురో అచట సంపదయు, విజయమున్ను ఐశ్వర్యమున్ను, దృఢమగు నీతియు ఉండునని నా యభిప్రాయము.

వ్యాఖ్య:- గీతా గ్రంథ మీశ్లోకముతో సుసంపన్నమగుచున్నది. భగవత్సాన్నిధ్యమందు, భక్తుని సాన్నిధ్యమందు ఎట్టి శుభప్రదమైన వాతావరణమేర్పడునో ఈ శ్లోకముద్వారా వెల్వడిచేయబడినది. ఎచట యోగేశ్వరుడగు శ్రీకృష్ణభగవానుడుండునో, మఱియు నెచట ధనుర్ధారియగు అర్జునుడుండునో అచట ఐశ్వర్యము, విజయము, మున్నగునవి వెలయుచుండునని చెప్పబడినది. కాబట్టి విజయమును, నీతిని, జ్ఞానసంపదను అభిలషించువారు భగవచ్చింతనాదులద్వారా సాక్షాత్ భగవానుని తమ హృదయమందు ప్రతిష్టింపజేసికొనవలెను.
భగవంతుడగు శ్రీకృష్ణుడుండుచోటే కాక, భక్తుడగు అర్జునుడుండుచోట గూడ అట్టి విజయాదులు సంభవించునని యేల చెప్పబడెననగా, అర్జునుడు సామాన్యభక్తుడు కాడు. ధనుర్ధారియగు భక్తుడు. అనగా బాహ్యశత్రువుల నే ప్రకారము గాండీవముచే జయించివైచెనో, అట్లే అంతఃశత్రువులనుగూడ గీతాజ్ఞానరూపధనుస్సుచే ఛేదించివైచి మోహరహితుడై విలసిల్లెను
 (నష్టో మోహః). ఈ ప్రకారముగ అజ్ఞానము నశించిన భక్తుడు సాక్షాత్ భగవంతుడే యగుచున్నాడు. (బ్రహ్మవిద్బ్రహ్మైవ భవతి) కావున ప్రకృతిని జయించినట్టియు, మాయాశత్రువును జ్ఞానఖడ్గముచే, జ్ఞానధనుస్సుచే విచ్ఛిన్న మొనర్చినట్టియు భక్తుడుండుచోటగూడ భగవత్సాన్నిధ్యమందువలె విజయ సంపదాదులు వర్ధిల్లుచుండుటలో ఆశ్చర్యమేమియును లేదు. అయితే ఇచట తెలిపినది సామాన్యభక్తుని విషయముకాదనియు, అజ్ఞానమును, కామక్రోధాదులను జయించి ప్రకృతిపై విజయమును సాధించిన (ధనుర్ధరుడగు) భక్తునివిషయమే చెప్పబడినదనియు నెఱుగవలెను. కాబట్టి గీతాజ్ఞానరూప మహాధనుస్సును జేబట్టినవాడును, నిష్కామకర్మ, భక్తి జ్ఞాన ధ్యాన  వైరాగ్యాదులు అను అస్త్రములను ధరించినవాడు నగు భక్తునిచెంత సాక్షాత్ భగవానుని సాన్నిధ్యమందువలె విజయాదులు వర్ధిల్లుచుండునని భావము. అట్టి పరమభక్తులు, జ్ఞానులు  సాక్షాత్ భగవత్స్వరూపులుగనే యుందురు. కావున దైవమందెట్టి పవిత్రీకరణశక్తి యుండునో వారియందున్ను అట్టి శక్తి యుండును. ఏలయనిన, అతిశయభక్తిస్థితియందు, లేక జ్ఞానస్థితియందు, భక్తునకును భగవంతునకును, లేక జ్ఞానికిని దేవునకును భేదము యుండదు. (జ్ఞానీత్వాత్మైవ మే మతమ్).

మఱియు "ధనుర్ధరః” అనుపదము కర్మయోగమును, నిర్మల అనుష్ఠానమును గూడ సూచించుచున్నది. ప్రతివ్యక్తికిని తత్త్వబోధతో బాటు అనుష్ఠానముగూడ ఉండవలెనని ఆ పదముచే స్పష్టమగుచున్నది.
ఎచట శ్రీకృష్ణుడుండునో అచట విజయ, ఐశ్వర్యము లుండునని తెలుపుటవలన ప్రతివారును తమ గృహమందును, తమ హృదయమందును భగవంతుని స్థాపించుకొని నిరంతరము అర్చన పూజాధ్యానాదులు సలుపుచుండినచో అచ్చోట సాక్షాత్ పరమాత్మయే నివసించుచుండును. గావున అట విజయైశ్వర్యాదులు తప్పక నుండగలవు. అట్లే ఎచట భక్తి జ్ఞాన వైరాగ్యాదులు, దైవీసంపత్తి గలిగియున్న మహనీయులు, భక్తవర్యులు నివసించుచుందురో అచ్చోట ధనుర్ధారియగు అర్జునుని సన్నిధానమందువలె విజయాదులు వర్థిల్లునని గ్రహింపవలెను. లోకమునందును ఇపుడు భగవత్పూజాదులు జరుగుచోట, మహనీయులుండు చోట శుభప్రదమైన వాతావరణము, విజయాది సల్లక్షణములు ఉండియుండుట మనము చూచుచునే యున్నాము.
ప్రతిజీవియు విజయమునే కోరునుగాని అపజయమును గాదు. సంపదనే కోరునుగాని దారిద్ర్యమునుగాదు. కాని అవి లభించుట కుపాయమేమి? ఆ యుపాయ మీ శ్లోకమున చెప్పబడినది. దానిని కార్యాన్విత మొనర్చుకొనినచో తప్పక ఆ విజయాదులు జనులకు లభించగలవు. శ్రీకృష్ణపరమాత్మను వారి హృదయమందు, వారి గేహమందు చేర్చుటయే ఆ యుపాయము. భగవంతుని భక్తిపూర్వకముగ ధ్యానించుచు భగవత్సాన్నిధ్యము ననుభవించుచుండుటయే ఆ యుపాయము. ఎచట శ్రీకృష్ణుడుండునో అచట విజయాదులుండుట తథ్యము. కాబట్టి భగవత్సాన్నిధ్యమును గలుగజేసికొనుచుండు భగవద్భక్తులకు విజయాదులు తప్పక సిద్ధించితీరును. అట్లే మహనీయులగు జ్ఞానులు, యోగిపుంగవులు మున్నగువారి సాంగత్యమందును అట్టి మహ మహచ్ఛక్తి కలుగగలదు. కావున భగవత్సాన్నిధ్యము, సజ్జనసాంగత్యము రెండిటిని కలుగజేసికొనుచు శ్రీకృష్ణార్జునుల (నరనారాయణుల) యిరువురి సాంగత్యశ్రీని అనుభవించుచుండవలెను.
మఱియు ఎచ్చోట (ఏ పక్షమున) శ్రీకృష్ణుడు, అర్జునుడు ఉండునో, ధర్మమేపక్షమున నుండునో అచట (ఆ పక్షమున) విజయము తప్పక కలుగునను వాక్యమును చెప్పుటద్వారా సంజయుడు పాండవ పక్షముననే విజయము కలుగునను భావమును ధృతరాష్ట్రునకు ధ్వనింపజేసెను. (ఆ వాక్యమును వినియైనను ధృతరాష్ట్రుడు  సంధిచేసికొని యుద్ధమును మాన్పించుట శ్రేయస్కరమని యాతనికి గూఢముగ బోధింపబడినది).
ఈ శ్లోకమందలి " ధ్రువానీతి” అను పదమునకు "నీతి మున్నగునవి తప్పక కలుగును' అని కొందఱు అర్థము చెప్పిరి.

గీతయొక్క అంతమున సంజయునిచే బోధింపబడిన ఈ "యత్రయోగేశ్వరః కృష్ణో" - అను మహత్తరమగు శ్లోకమును భక్తులు మఱల మఱల జ్ఞాపకము చేసికొనుచు భగవత్సాన్నిధ్యమును తమ హృదయమున నిరంతరము కలుగజేసికొనుచు భగవదనుగ్రహముచే జీవితములను ఆనందమయములుగ నొనర్చుకొందురుగాక!

మఱియు భగవానునిచే కరుణతో బోధింపబడిన ఈ గీతాశాస్త్రము నంతను చక్కగ పఠించి, అనుష్టించి, ఆత్మానుభూతిని బడసి జన్మరాహిత్యరూప నిత్యానందపదవి నొందుటద్వారా మానవ జీవితమును కృతార్థము చేసికొందురు గాక!

       హరిః ఓం తత్ సత్
శ్రీమన్మహాభారతే శతసాహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం
శ్రీమద్భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం
యోగశాస్త్రే  శ్రీకృష్ణార్జునసంవాదే మోక్షసన్న్యాసయోగోనామ
అష్టాదశోఽధ్యాయః

ఇది శ్రీవ్యాసముని విరచితమైనదియు, నూఱువేల శ్లోకములు గలదియును, ఛందోబద్ధ మైనదియు నగు శ్రీమహాభారతమున భీష్మపర్వమునగల ఉపనిషత్ప్రతిపాదకమును, బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జునసంవాదమును నగు
శ్రీ భగవద్గీతలందు మోక్షసన్న్యాసయోగమను
పదునెనిమిదవ అధ్యాయము
సంపూర్ణము
హరిః ఓమ్ తత్ సత్
శ్రీ పరబ్రహ్మార్పణమస్తు ఓమ్

0 comments:

Post a comment