Games

 

18 Nov 2017

గీతామకరందము-01-04,05,06

0 comments
01-04,05,06-గీతా మకరందము.
        అర్జునవిషాదయోగము
    
      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అ|| దుర్యోధనుడు పాండవపక్షమునగల ముఖ్యయోధుల పేర్లను ద్రోణాచార్యున కెఱింగించుచున్నాడు -

అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి | 
యుయుధానో విరాటశ్చ 
ద్రుపదశ్చ మహారథః || 

ధృష్టకేతు శ్చేకితానః 
కాశీరాజశ్చ వీర్యవాన్ | 
పురుజిత్కున్తిభోజశ్చ
శైబ్యశ్చ నరపుంగవః || 

యుధామన్యుశ్చ విక్రాన్త 
ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ | 
సౌభద్రో ద్రౌపదేయాశ్చ 
సర్వ ఏవ మహారథాః || 

తా:-   ఈ పాండవ సేనయందు గొప్ప విలుకాండ్రును, యుద్ధమునందు భీమార్జునులతో సమానులునగు శూరవీరులు పెక్కురుకలరు. వారెవరనిన - యుయుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, ధృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడగు కాశీరాజు, పురుజిత్తు, కున్తిభోజుడు, నరోత్తముడగు శైబ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలియగు ఉత్తమౌజుడు, అభిమన్యుడు ఉపపాండవులు. వీరందఱును మహారథులే అయి యున్నారు.     

వ్యాఖ్య:- పైన దెల్పిన వీరులందఱు భీమార్జునులతో సమానులని చెప్పుటవలన వారిరువురును శూరాగ్రేసరులనియు, దుర్యోధనునకు భయోత్పాతము కలిగించువారనియు స్పష్టపడుచున్నది. దుర్యోధనుడు స్వపక్షవీరులను గూర్చి ముందుగా దెలుపక పరపక్షనాయకులను వర్ణించి చెప్పుటలో రెండు కారణములు కలవు - (1) ఆచార్యునకు శత్రుసైన్యముపై రోషము కల్పించుట (2) తన సైన్యము విషయమై ధైర్యము తగ్గియుండుట, లేక, తన సైన్యముకంటె ప్రతిపక్ష సైన్యమే బలవత్తరముగ నున్నదను భావము గలిగియుండుట.

“మహారథుడు" - పదివేల ధనుర్ధరులగు యోధులతో ఏకాకిగ యుద్ధము చేయగలవాడును, ఆయుధశాస్త్రమందు ప్రవీణుడునగు శూరుడు మహారథు డనబడును*.
యుయుధానుడు - ఇతనికి సాత్యకి యనియు పేరుగలదు. 
ధృష్టకేతువు - చేదిదేశపురాజు, శిశుపాలుని పుత్రుడు. 
పురుజిత్, కున్తిభోజులు - కుంతీదేవికి సోదరులు.
ద్రౌపదేయులు - ద్రౌపదిసుతులగు ఉపపాండవులు, ప్రతివింద్యుడు, శ్రుతసోముడు, శ్రుతకీర్తి, శతానీకుడు, శ్రుతసేనుడు - వీరైదుగురున్ను క్రమముగ ధర్మరాజ భీమాదులకు ద్రౌపదివలన గలిగిన సంతానము.
-------------------------
*ఏకోదశసహస్రాణి యోధయేద్యస్తు ధన్వినామ్ 
శస్త్రశాస్త్ర ప్రవీణశ్చ మహారథ ఇతి స్మృతః

0 comments:

Post a Comment