Games

 

16 Nov 2017

గీతామకరందము-01-03

0 comments
01-03-గీతా మకరందము.
        అర్జునవిషాదయోగము
    
      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అ||  దుర్యోధనుడు ద్రోణాచార్యుని సమీపించి ఈ ప్రకారముగ పలుకుచున్నాడు –

పశ్యైతాం పాణ్డుపుత్రాణాః 
ఆచార్య మహతీం చమూమ్ | 
వ్యూఢాం ద్రుపదపుత్రేణ 
తవ శిష్యేణ ధీమతా || 

తా:- ఓ గురువర్యా! బుద్ధిశాలియు, మీశిష్యుడునగు ధృష్టద్యుమ్నునిచేత వ్యూహాకారముగ రచింపబడియున్నట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమును జూడుడు!

వ్యాఖ్య:- ఈ శ్లోకమునకు ముందు 'దుర్యోధన ఉవాచ' అని యుండవలసినది. కాని అట్లులేదు.
పాపియగుటచే ఆతని నామమును పుణ్యశీలురగు గీతాపాఠకులచే పలుమారు ఉచ్చరింపకుండ జేయుటకే కాబోలు ఆ విధముగ గావింపబడినది!
   దుర్యోధనుడు రాజకీయ చతురత గలవాడు. కార్యసాధన నిమిత్తము రాజగు తానే దిగివచ్చి ఒకానొక సేనానాయకునితో (ద్రోణాచార్యునితో) మాట్లాడుటయేకాక, ప్రతిపక్షముపై నాతనికి రోషమునుగూడ కల్పింపజొచ్చెను. ‘ద్రుపదుని  పుత్రుడును, మీ శిష్యుడునగు ధృష్టద్యుమ్నుడు పాండవసేనలను చక్కగా తీర్చిదిద్దెను - ’ అని పలుకుట ద్వారా యతడు ద్రోణాచార్యునకు ద్రుపదుని యెడలగల పూర్వపు వైరమును జ్ఞప్తికి దెచ్చెను. మఱియు ‘మీకు శిష్యుడుగానున్నవాడే ప్రతిపక్షమునకు నాయకుడై గురువగు మీ పైననే కత్తిగట్టుచున్నాడ’ని తెలిపి ద్రోణాచార్యునకు తీవ్రమగు రోషమును జనింపజేయు చున్నాడు. ఎదిరి పక్షమును, తన్నాయకుని గొప్పగా వర్ణించుటద్వారా స్వపక్షనాయకునకు వారిపై ప్రతీకారభావనను వృద్ధినొందించుటయే దుర్యోధనుని యాశయము. 
   ‘ధీమంతు’డని పేర్కొనబడుటచే ధృష్టద్యుమ్నుడు వ్యూహరచనలో గొప్పనేర్పరి యని తేలుచున్నది. కనుకనే యాతనిని పాండవులు తమ సేనానాయకునిగ నెన్నుకొనియుండిరి.

0 comments:

Post a Comment