Games

 

15 Nov 2017

గీతామకరందము 01-01

0 comments
01-01-గీతా మకరందము
        అర్జునవిషాదయోగము
    
      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి

శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 
శ్రీ సద్గురు పరమాత్మనే నమః - సర్వమహర్షిభ్యోనమః 
గీతా మకరంద వ్యాఖ్యాసహిత 
 శ్రీ భగవద్గీత 

అథ ప్రథమోఽధ్యాయః 
ఒకటవ అధ్యాయము 
అర్జునవిషాదయోగః

అర్జున విషాద  యోగము 

అవతారిక ||  యుద్ధమునుగూర్చి ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నించుచున్నాడు – 

ధృతరాష్ట్ర ఉవాచ :-
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః | 
మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సంజయ || 

తాత్పర్యము:- ధృతరాష్ట్రుడిట్లు పలికెను:- ఓ సంజయా! నావారలగు దుర్యోధనాదులును, పాండుపుత్రులగు ధర్మరాజాదులును యుద్ధముచేయ కుతూహలముతో పుణ్య భూమియగు కురుక్షేత్రమున జేరి యేమి చేసిరి?

వ్యాఖ్య:- “ధర్మ” శబ్దముతో గీత ప్రారంభమైనది. అది మంగళవాచకము. ధర్మమను పదమును మొట్టమొదట ప్రయోగించుటద్వారా శ్రీ వ్యాసమహర్షి గీతకు మంగళాచరణమును గావించినవాడాయెను. ఏలయనిన, భగవానుడు ధర్మస్వరూపుడు. ధర్మశబ్దోచ్చారణముచే భగవన్నామమునే వ్యాసులు కీర్తించినట్లైనది. గీతాగ్రంథము యొక్క లక్ష్యము, సారాంశము ఈ మొదటి పదమునందే తేల్చివేయబడెను. అదియే "ధర్మము”. అట్టి ధర్మోద్దరణము కొఱకే లోకమున భగవంతు డవతరించుచుండును*. 

 ధృతరాష్ట్రుడనగా రాష్ట్రమును ధరించినవాడని యర్థము. తనదికాని రాష్ట్రమును తనదని భావించువాడే ధృతరాష్ట్రుడు. ఈ ప్రపంచము, దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి  మున్నగునవి దృశ్యములు, అవి తాను గాదు. దృక్కగు ఆత్మయొకటియే తానుగాని, దేహాది దృశ్యపదార్థములు కాదు. కాని అజ్ఞాని తనదికానట్టి అనగా ఆత్మేతరమైనట్టి దేహాది దృశ్యరూపరాష్ట్రమును తనదిగా దలంచి దానిపై మమత్వము, అహంభావము గలిగియుండుచున్నాడు. కనుకనే ఆతడు ధృతరాష్ట్రుడు. అజ్ఞానభావముతో గూడియుండు వారందఱున్ను ధృతరాష్ట్రులే యగుదురు. గీతాజ్ఞానశ్రవణముచే అట్టి అజ్ఞానరూప అంధత్వమును రూపుమాపుకొనుట ప్రతివానియొక్క కర్తవ్యమైయున్నది.

'కురుక్షేత్రము':- ఇది చాల గొప్ప పుణ్యక్షేత్రము. పంజాబ్ రాష్ట్రమున అంబాలా అను పట్టణమునకు దక్షిణముగను, ఢిల్లీ పట్టణమునకు ఉత్తరముగను ఇది వెలయుచున్నది. మహాభారత మందలి వనపర్వమున 83వ అధ్యాయమునందును, శల్యపర్వమున 53వ అధ్యాయమునందును ఈ కురుక్షేత్రము యొక్క మహిమను గుఱించి లెస్సగ తెలుపబడియున్నది. పూర్వము బ్రహ్మదేవుడు, ఇంద్రుడు అగ్ని  మున్నగు వారచ్చోట తపంబు సలిపియుండిరి. కౌరవులకు పాండవులకు మూలపురుషుడైన కురుమహారాజున్ను ఆ  స్థలమున పెక్కు ధర్మము లాచరించి యుండెను. ఒకానొక సమయమున కురుభూపాలుడు ఆ ప్రదేశమును దున్నుటచే దానికి కురుక్షేత్రమని పేరువచ్చినది. ఆ క్షేత్రమునందెవరు  తపస్సు చేయుదురో, లేక మృతినొందుదురో వారు ఉత్తమలోకములకు జనుదురని ఇంద్రుడు కురునకు వరమిచ్చెను. పూర్వము పరశురాముడున్ను అచ్చోటనే పితృతర్పణము గావించి యుండెను. ఎందఱో మహనీయులా స్థలమున పెక్కు ధర్మకార్యము లాచరించి యుండిరి. కాబట్టి అయ్యిది. ధర్మక్షేత్రమని పేర్కొనబడెను.
   అట్టి ధర్మక్షేత్రమున ప్రవేశించుటవలన తత్ప్రభావముచే తన తనయులగు దుర్యోధనాదుల చిత్తమున దయాది సద్గుణములు ఉదయించిగాని, ధర్మరాజాదుల యందలి సహజ అహింసాది సద్గుణములు పెల్లుబికిగాని యుద్ధవిరమణమును గూర్చిన సంకల్పము లేవైన వారియందు ఉదయించియుండునేమోయను శంకచే ధృతరాష్ట్రుడు "యుద్ధమున వారేమిచేసిరి?' అని ప్రశ్నించి యుండవచ్చును.

'మామకాః' - 'నావారు' అని కౌరవులనుగూర్చి ప్రత్యేకించి చెప్పుటవలన ఆత్మీయులే యగు పాండవులయెడల ధృతరాష్ట్రునకొకింత పక్షపాతబుద్ధి కలదని వ్యక్తమగుచున్నది.

"సంజయుడు” - 'సమ్యక్ జయము' కలవాడే సంజయుడు. ఇంద్రియాదులను లెస్సగ నిగ్రహించినవాడని యర్థము. అట్టి ఇంద్రియజయము, పవిత్రహృదయము కలవారికే గీతా జ్ఞానము వినుటకు, ఆచరించుటకు, బోధించుటకు చక్కని యవకాశ మేర్పడగలదని సంజయుని వృత్తాంతము చాటుచు న్నది. మఱియు అల్పజాతియందు జనించినప్పటికిని (సూతకులస్థుడైనను), స్వకీయయోగ్యతచే, హృదయపారిశుద్ధ్యముచే వ్యాసాది మహర్షుల యొక్క అనుగ్రహమునకు పాత్రుడగుటయు, ప్రత్యక్ష గీతాశ్రవణ విశ్వరూపసందర్శనాది మహాభాగ్యముల నొంద గల్గుటయు చూడ, ఆత్మోన్నతికి జాతి, మత, కులాదులేవియు అడ్డంకులుకావని స్పష్టపడుచున్నది.
దుర్యోధనుని జయమును గుఱించి తెలిసికొనగోరి ధృతరాష్ట్రుడడిగిన 'ధర్మక్షేత్రే కురుక్షేత్రే ...... కిమకుర్వత సంజయ' అను గీతయొక్క ప్రథమశ్లోకరూప ప్రశ్నకు సంజయుడు "యత్ర యోగేశ్వరః కృష్ణో .......... ధ్రువా నీతిర్మతిర్మమ' (గీత 18-78) ఎచట శ్రీకృష్ణుడు, అర్జునుడు ఉందురో అచట విజయము తథ్యము అను గీతయొక్క చివరి శ్లోకమును ప్రత్యుత్తరముగ జెప్పదలంచినవాడై తద్భావమును పోషించుట కొఱకు అవాంతర వృత్తాంతమును (దృష్ణ్వాతు పాణ్డవానీకం...' మున్నగు శ్లోకములద్వారా) నుడువ నారంభించెను.
-----------------------------------
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే (4-8).
-----------

0 comments:

Post a comment